వసోట ట్రెక్..!

నా వృత్తిలో భాగంగా నేను మహారాష్ట్ర లోని బారామతికి వెళ్ళడం జరిగింది. అప్పుడు ఒక రోజు నా సహ ఉద్యోగులు అందరం కలిసి వసోట జంగిల్ ట్రెక్కింగ్ వెళ్దాం అనుకున్నాం. నేను ఎప్పుడూ ట్రెక్కింగ్ కి వెళ్ళకపోవడం తో చాలా ఆత్రుతగా అనిపించింది.

ఉదయం 4గం|| కి మేము మా ప్రయాణం వసోటకి మొదలు పెట్టాం. అక్కడికి మేము మా సహ ఉద్యోగుల వాహనాల్లో ప్రయాణించాం. మేము 10 మంది వెళ్ళాం. అంతమంది వెళ్ళాం కాబట్టి భలే సరదాగా అనిపించింది.

ఉదయం 4గం|| వసోట కి మొదలవుతున్నప్పుడు దారి లో తేనీటి విందుకు ఆగినప్పుడు తీసిన ఛాయాచిత్రం

ట్రెక్కింగ్ మొదలు కావాలి అంటే ముందు మనం సుందరమైన లాంచీ ప్రయాణం చేయాల్సి ఉంటుంది.   ఆ లాంచీ మనల్ని అందమైన అడవి మీదుగా మన ట్రెక్కింగ్ కు దారి తీస్తుంది.

లాంచీ ప్రయాణం మధ్య అందమైన దృశ్యాన్ని చూసినప్పుడు వెంటనే కెమెరా లో బంధించిన ఛాయాచిత్రం

ఉదయం 9గం|| లోపు వెళితే మనకు త్వరగా పడవ దొరికే అవకాశం ఉంది. లాంచీ ప్రయాణం అయిపోయింది. తరువాత అక్కడ మన వస్తువులు తనిఖీ జరుగుతుంది. వాళ్ళు మనతో పాటు ఒక గైడ్ ని కూడా పంపిస్తారు. మనం దాదాపు 10-12 కి.మి లు నడవాల్సి ఉంటుంది.

మా ట్రెక్కింగ్ కు మేము మొదలవుతుండగా తీసిన ఛాయాచిత్రం

ఈ ప్రయాణాకి మాకు మనిషికి 955/- రూపాయలు ఖర్చు అయింది. ఇందులో ఇంకొక ఉపాయం ఉందండోయ్. అది ఏంటి అంటే ఎంత ఎక్కువ మంది వెళితే అంత తక్కువ ఖర్చుతో మనం ఈ ట్రెక్కింగ్ ని వెళ్ళి ఆనందించవచ్చు.

మా గమ్యం చేరిన తర్వాత తీసిన ఛాయాచిత్రం

బారామతి లో భాగమతి..!

ఒక సారి నేను నా వృత్తి రీత్యా బారామతి అని మహారాష్ట్రలో ఒక టౌన్ కి వెళ్ళ వలసి వచ్చింది.ఇంక అక్కడ ఎవరితో మాట్లాడానికి లేదు, ఒక వేళ మాట్లాడాలి అనుకున్న మనకి అక్కడ భాషైన మరాఠీ రాదాయె, ఏంటి మనకి అని మమ్మల్ని కలిపేసుకుంటోంది అనుకోకండే మా గోదారోళ్ళకి కలుపుకోవడం పెద్దగా సమయం పట్టదు. ఒక రోజు నాకు మా ఇల్లు, ఊరు, స్నేహితులు బాగా గుర్తొచ్చి  బాగా ఏడ్చేసా.ఈ లోపు అక్కడ గది అవన్నీ శుభ్రపరచడానికి అక్కడి పని మనుషులు రావడంతో కళ్ళు తుడుచుకుని ఇక నా బాధ అంతా కాగితం మీద వ్యక్తపరిచా. అప్పుడు ఆ కాగితం మీద వ్యక్తపరిచిన సారాంశాన్ని ఇప్పుడు ఇక్కడ రాస్తున్నాను.
వెళ్ళాలని ఉంది
అమ్మ ఒడి ఉన్న ఇంటికి, నాన్న బండి మీద గోదారి గట్టుకి,
వెళ్ళాలని ఉంది
అక్కతో చేసే అల్లరికి, మనసును తీపి చేసే అమ్మమ్మ వంటకీ,
సమయాన్ని చిన్నగా చేసే స్నేహితుల సరదాలకి
వెళ్ళాలని ఉంది
వెళ్ళి ఇంకొక జీవితం గడిపాలని ఉంది…!
ఏంటి ఎప్పుడూ ఒక పాఠంలా రాసే ప్రత్యూష ఈరోజు కేవలం ఉపోద్ఘాతం రాసింది అనుకుంటున్నారా ఈ సారికి ఇలా సర్దుకోండి.
వచ్చే శీర్షిక నుండి నేను చేసే వంటలు గురించి కూడా రాద్దాం అనుకుంటున్నా. మీ అభిప్రాయం ఏంటో నా చెవిన పడేయండి. అదేనండీ మీ అభిప్రాయం కూడా తెలుసుకుందాం అని, తెలిస్తేనే కాదా నేను మరింత స్పష్టమైన అవగాహన తెచ్చుకుని రాయగలను.
ఇట్లు
మీ ప్రత్యూష.

బెంగుళూరు లో గోదారమ్మాయి..❤️❤️

జీవితం లో వేసే ప్రతి అడుగు చేసే ప్రతి పని, ప్రతి ప్రయాణం ఎప్పుడు ఎక్కడ, ఏ గమ్యానికి,ఎలా చేరు‍స్తుం‌దో ‌‌తెలీదు. అనుకోకుండా బెంగుళూరు గోదారమ్మాయి కథే ఈ రోజు మీకు చెప్పబోతున్న.మళ్ళా బెంగుళూరు అంటే ఏ ఉద్యోగానికో, డబ్బులు సంపాదించడానికో కాదండీ బాబూ ఏదో 4 రోజులు అక్క కూతురు తో ఆడుకుందాం అని వచ్చాం.

అంతర్జాలంలో ధూమశకటానికి ప్రయాణపు చీటీ (ticket) తో మొదలైంది నా ప్రయాణం.(నా అచ్చ తెలుగు చూసి ఏదో తెగులు అని అనుకోకండి గోదారమ్మాయిని కదా కొంచెం భిన్నంగానే ఉంటుంది.) కొంచెం అటు ఇటు పోలికలతో పుట్టిన కవల పిల్లల అనిపించింది, ఇక్కడి కన్నడం భాష మన తెలుగు భాష.కానీ భాషే కాదండీ బాబూ ప్రేమానురాగాలు, ఆప్యాయతలు పెంచుతారని తెలుసుకోవడానికి పెద్దగా సమయం పట్టలేదండోయ్.

5 అంకెల జీతం సంపాదించాలంటే వారానికి 5 రోజులు పని చేస్తేనే చాలని బెంగుళూరు చెప్పకనే చెబుతుంది.కానీ అదే 5 అంకెల కళాశాల ఫీజులకు నాన్న ఎంత కష్టపడ్డారో ఒక్కసారిగా 70mm తెర మీద స్లో మోషన్ లో కనిపించింది.మం‌‌చో‌‍‍ చెడో నలుగురిలో భిన్నంగా బ్రతకాలని ఆ అరకు ఆ ఆవు చదివేటప్పుటి నుండి మా నాన్న చెప్తూ పెంచారు.అలాంటి భావాలతో పెరిగిన నేను  ఉద్యోగం చేస్తే మా నాన్న ఆర్థిక స్తోమతని, నా మనోస్థైర్యాన్నీ పెంచుతుందని నిర్ణయించుకున్న రోజులవి.

పుట్టిన ఊరు, పెరిగిన విధానం, పెట్టుకున్న ఆశయాలతో గొప్పది కానిది నా బుర్రని గోడకి కొట్టిన బంతి లా ఇంటర్వూ నుండి బయటకి వచ్చినప్పుడే అర్థమైంది.తాను పని చేస్తున్న సంస్థలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పిన నా మిత్రుని సాయంతో బెంగుళూరు లో గోదారమ్మాయి ఉద్యోగం సంపాదించింది.తల నిండా అమ్మమ్మ ఇచ్చిన కొబ్బరి నూనె తో పాపిడి తీసుకున్న జడతో రెండు వైపులా చున్నీ తో ఉండే ప్రత్యూష.

ఉండే స్థలం మారింది ఏమో కానీ కవ్విస్తే నవ్వడం, కలవరం అనిపిస్తే కంటి నిండా నీళ్ళతో ఏడవటం, ఇలాంటివి మారకుండా తన ఉద్యోగ జీవిన్నాన్ని, అక్క వాళ్ళ ఇంటి నుండి సూర్యోదయానికి ముందు మొదలుపెట్టి, సూర్యాస్తమయం వరకు అందరూ ఉన్న ప్రపంచం లో ఒంటరి పోరాటం చేసేది.కొత్త  ఉద్యోగం,కొత్త మనుషులు, ప్లాస్టిక్ పరిసరాలు వాడే పాల నుండి మాట్లాడే మనుషుల వరుకూ అన్నీ నకిలీవే.

తనకున్న సంతోషమల్లా అక్క తో వచ్చీ రాని వంటల ప్రయోగాలు,ఏ కల్మషం లేని శాన్వి (అక్క కూతురు). అన్నీ బాగుంటే అది జీవితం ఎందుకు అవుతుంది, అన్నీ వంటలు చేసి పులిహోర లో తాలింపు వేసే సమయంలో గ్యాస్ అయిపోయినట్టు, బావుంది రా బ్రతుకు జీవుడా అనుకునే సమయం లో బావగారి  ఉద్యోగం రెండో తెలుగు రాష్ర్టమైన తెలంగాణాకు మారాల్సిచ్చొంది.అక్కడితో పెనం మీద అట్టు పొయ్యి మీద పడ్డట్టు  ప్రత్యూష జీవితం అక్కగారి ఇంటి నుండి అద్దె కొట్టే వసతీ గృహానికి (పేయింగ్ గెస్ట్) మారింది.

అందరితో ఉంటూ ఒంటరి గా బ్రతికే ప్రత్యూష జీవితంలోకి తన లాగే బ్రతికే మరో సహోద్యోగి శ్రావ్య. మరీ బాపు బొమ్మలా, బుట్ట బొమ్మలా కాకపోయినా తట్టలో పెట్టిన కొండపల్లి బొమ్మలా ఉంటుంది. ఎప్పుడు నువ్వుతూ, ప్రత్యూష ని నవ్విస్తూ , అమ్మ లేని లోటు ను, అప్పుడే వెళ్ళిపోయిన అక్క లేని లోటు ను త్వరగానే పూరిస్తుంది. 5అంకె‍ల జీతం తీసుకున్న 5రోజులకే 500కూడా‍ మిగలడం కష్టమని మొదటి జీతం తోనే తెలుసుకోవడానికి పెద్దగా సమయం పట్టలేదు.

రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలనట్టూ నాతో పాటు బాల్యంలో చదువుకున్న మిత్రులు నాకు ఇక్కడ కలిశారు.కానీ‍ రామేశ్వరం శనేశ్వరం లా కాకుండా ఊటీ కొడయ్ క్యానల్ లా మా స్నేహం ఉండటం తో ఒక్కసారిగా జీవితం మరలా పాఠశాల వైపు అడుగులు వేసింది.

గోదారిలో పడవల్ని చూస్తూ ఇంటి దగ్గర కాగితపు పడవలతో ఆడుకునే ప్రత్యూష ఒంటరిగా, ధైర్యంగా, నవ్వాలని నువ్వుతూ, తాను అనుకున్న గమ్యాలకు చేరడానికి ముందడుగులు వేస్తూ ఉంటుంది.ఎవడో అన్నాడు ఈ ఇంటర్నెట్, ఫోన్ ఎందుకు కనిపెట్టార్రా అని.? సాయంత్రం ఐతే అమ్మతో నాన్నతో వీడియో కాల్ చేస్తూ, ఇక్కడ తినే సాంబారన్నం కూడా వాళ్ళని చూస్తే ఇంగువ పులిహోరలా అనిపించేది.అప్పటికి‍‍ తన ప్రపంచం దూరంగా ఉన్న కుటుంబ సభ్యులను సంచార వాణి (సెల్ ఫోన్) ద్వారా దగ్గరగా చూసుకునేది.

చివరాఖరికి సముద్రం లోనే కలిసిపోయినట్టు ఉంటుంది మా గోదారమ్మ.కాని‍ కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణిస్తూ లక్షల కుటుంబాలు తినే అన్నాన్ని పండించే రైతులకు కన్న తల్లిలా సాయం చేస్తుంది.కాల‍ గమనం ఎన్నో జ్ఞాపకాలు మిగులుస్తుంది అంటారు.

మరేమీ వద్ధు, నేను నా గోదారి.ఇదే‍‌ బెంగుళూరులో గోదారమ్మాయి.

ఇట్లు
మీ మంచి కోరుకునే,
మీ గోదారమ్మాయి